ఎకెఎస్ ఎంటర్‌టైన్‌మెంట్
శరభ
తారాగణం: ఆకాష్‌కుమార్, మిస్టీ చక్రవర్తి, జయప్రద, నాజర్, నెపోలియన్, పునీత్ ఇస్సార్, చరణ్‌దీప్, తనికెళ్ళ భరణి, ఎల్.బి.శ్రీరామ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: రమణ సాల్వ
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
సంగీతం: కోటి
నిర్మాత: అశ్వనీకుమార్ సహదేవ్
రచన, దర్శకత్వం: ఎన్.నరసింహారావు
విడుదల తేదీ: 22.11.2018
భగవంతుడికి, క్షుద్రశక్తికి మధ్య పోరాటం ఆది నుంచి ఉన్నదే. చివరికి గెలిచేది దైవశక్తే. ఇదే సూత్రాన్ని సినిమా పుట్టినప్పటి నుంచి దర్శకనిర్మాతలు పాటిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే కథలు రాస్తున్నారు. అయితే ఈమధ్యకాలంలో ఈ తరహా కథలతో రూపొందిన సినిమాలకు ఆదరణ తగ్గింది. అరుంధతి వంటి కొన్ని సినిమాలు మాత్రమే ఘనవిజయాలు సాధించాయి. కేవలం దైవభక్తి, క్షుద్రశక్తి మధ్య జరిగే పోరాటాన్నే చూపించకుండా కొన్ని ఫ్యామిలీ ఎమోషన్స్, అబ్బుర పరిచే విజువల్ ఎఫెక్ట్స్ వల్ల అరుంధతి వంటి సినిమాలు విజయం సాధించాయి. చాలా కాలం తర్వాత ఆ తరహా కథతో వచ్చిన సినిమా శరభ. ఈ చిత్ర నిర్మాత అశ్వనీకుమార్ సహదేవ్ కుమారుడు ఆకాష్‌కుమార్‌ను హీరోగా పరిచయం చేస్తూ ఎన్.నరసింహారావు ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ గురువారం విడుదలైన ఈ సినిమా ఏ మేర ప్రేక్షకుల్ని ఆకట్టుకుందో సమీక్షలోకి వెళ్ళి తెలుసుకుందాం.
క్షుద్ర సామ్రాజ్యానికి అధిపతి కావాలన కోరికతో క్షుద్ర పూజలు చేస్తూ సంవత్సరానికి ఒక కన్య చొప్పున 17 సంవత్సరాలు నిర్విఘ్నంగా బలి ఇస్తూ వస్తాడు చంద్రాక్ష(పునీత్ ఇస్సార్). 18వ సంవత్సరం కూడా అదే మాదిరిగా కన్యను బలి ఇస్తే చంద్రాక్ష కోరిక నెరవేరుతుంది. కానీ, సిరిగిరిపురం గ్రామ పెద్ద అయిన కార్తవరాయుడు(నెపోలియన్) వల్ల చంద్రాక్ష కోరిక నెరవేరకుండానే చనిపోతాడు. దాన్ని తాను పూర్తి చేస్తానంటూ అతని కుమారుడు రక్తాక్ష( ప్రతిన బూనుతాడు. మధ్యలో ఆగిపోతే మళ్ళీ మొదటి సంవత్సరం నుంచి ఆ పూజలు చెయ్యాల్సి ఉంటుంది. తండ్రిలాగే రక్తాక్ష 17 సంవత్సరాలు పూర్తి చేస్తాడు. 18వ సంవత్సరానికి దివ్య(మిస్టీ చక్రవర్తి) అనే అమ్మాయిని బలి ఇవ్వాలని నిర్ణయిస్తాడు రక్తాక్ష. నరసింహ స్వామి ఆశీస్సులతో పుట్టిన కార్తవ రాయుడి కుమారుడు శరభ(ఆకాష్‌కుమార్) దివ్యను రక్తాక్ష నుంచి కాపాడేందుకు సిద్ధమవుతాడు. చంద్రాక్షను కార్తవరాయుడు ఎందుకు చంపాడు? రక్తాక్ష పూజను భగ్నం చేసేందుకు శరభ ఎలాంటి ప్రయత్నాలు చేశాడు? చివరికి క్షుద్ర శక్తుల నుంచి సిరిగిరిపురం కాపాడబడిందా? అనేది మిగతా కథ.
బలమైన కథ, కథనం, దానికి తగ్గ ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ కుదిరితేనే ఏ సినిమా అయినా విజయం సాధిస్తుంది. ఈ సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది హీరో ఆకాష్‌కుమార్, హీరోయిన్ మిస్టీ చక్రవర్తి. ఈ ఇద్దరి క్యారెక్టర్స్‌కి తగ్గ ఆర్టిస్టుల్ని ఎంపిక చేసుకోవడంలో దర్శకుడు విఫలమయ్యాడని చెప్పొచ్చు. వీరిద్దరి పెర్‌ఫార్మెన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉంది. చాలా కాలం తర్వాత తెరమీద కనిపించిన జయప్రద తన క్యారెక్టర్ పరిధి మేరకు ఫర్వాలేదు అనిపించారు. జులాయిగా తిరుగుతూ కామెడీ చేసే క్యారెక్టర్‌లో నాజర్ కొత్తగా కనిపించాడు. చంద్రాక్షగా పునీత్ ఇస్పార్, రక్తాక్షగా చరణ్‌దీప్ మంచి నటనను ప్రదర్శించారు.
సాంకేతిక నిపుణుల గురించి చెప్పాల్సి వస్తే... రమణ సాల్వ ఫోటోగ్రఫీ బాగుంది. ప్రతి సీన్‌ని రిచ్‌గా చూపించే ప్రయత్నం చేశాడు. కోటి చేసిన పాటల్లో రెండు పాటలు బాగున్నాయి. సిట్యుయేషన్‌కి తగ్గట్టు అతను చేసిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది. కోటగిరి వెంకటేశ్వరరావు సినిమాలోని కొన్ని సీన్స్‌ని ఎడిట్ చేసి ఉంటే స్పీడ్ పెరిగి ఉండేది. ముఖ్యంగా సెకండాఫ్‌లో చాలా సీన్స్ తగ్గించే అవకాశం ఉంది. అన్నింటికంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది గ్రాఫిక్స్ గురించి. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు చేసిన గ్రాఫిక్ వర్క్ చాలా బాగుంది. భారీ సినిమా రేంజ్‌లో విజువల్స్‌ని క్రియేట్ చేశారు. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే ఈ తరహా కథలు మనకు కొత్త కాదు. ఇలాంటి సినిమాలు మనం ఎన్నో చూసేశాం. కొత్తగా చెప్పేందుకు ఏమీ లేదు. అయినా గ్రాఫిక్స్ సాయంతో సినిమాని నడిపించాలన్న అతని కోరిక నెరవేరలేదు. కథ, కథనాలు పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్‌గా మారింది. అంతే కాకుండా సెకండాఫ్‌లో మితిమీరిన ఎమోషనల్ సీన్స్ కూడా ఆడియన్స్‌కి చిరాకు తెప్పిస్తాయి. టెక్నికల్‌గా హై స్టాండర్డ్స్‌లోనే ఉన్నప్పటికీ హీరో, హీరోయిన్ సినిమాకి మైనస్ కావడం ప్రేక్షకులు సీట్లలో కూర్చోవడం కష్టతరంగా మారింది. దానికితోడు అతి కామెడీ, అతి సెంటిమెంట్ సినిమాని పక్కదారి పట్టించాయి. సినిమాలో బలమైన కథ లేకపోవడం, ప్రారంభం నుంచి చివరి వరకు సినిమాని నడిపించిన తీరు పేలవంగా ఉండడం వల్ల ఎంత గ్రాండియర్ ఉన్నా అసలు విషయం సున్నా కావడంతో థియేటర్ నుంచి బయటికి వచ్చే ప్రేక్షకులు సినిమాలో ఏమీ లేదు అని తేల్చిపారేస్తారు.
ఫినిషింగ్ టచ్: అన్నీ ఉన్నా విషయం సున్నా
from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/2FCoeyj
0 Comments