మైత్రి మూవీ మేకర్స్
సవ్యసాచి
తారాగణం: నాగచైతన్య, మాధవన్, భూమిక, నిధి అగర్వాల్, వెన్నెల కిశోర్, సత్య, షకలక శంకర్, బ్రహ్మాజీ, తాగుబోతు రమేష్, సుదర్శన్ తదితరులు
సినిమాటోగ్రఫీ: యువరాజ్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
నిర్మాతలు: నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, సి.వి.మోహన్(సివిఎం)
రచన, దర్శకత్వం: చందు మొండేటి
విడుదల తేదీ: 02.11.2018
మన తెలుగు సినిమాల్లోని హీరోలకు ఈమధ్యకాలంలో రకరకాల వ్యాధులు సోకుతున్నాయి. వాటి ద్వారా ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చెయ్యడానికి వాళ్ళు ఉవ్విళ్లూరుతున్నట్టు కనిపిస్తోంది. హీరోకి ఏదో ఒక అవలక్షణం ఉంటే తప్ప సినిమా సూపర్‌హిట్ అవ్వదన్న సెంటిమెంట్ మన దర్శకనిర్మాతల్లో బాగా ప్రబలిపోయినట్టుంది. తమిళ సినిమా గజిని, అపరిచితుడు మొదలుకొని చాలా సినిమాలు ఈ తరహా కథలతో వచ్చాయి. ఈమధ్య వచ్చిన భలే భలే మగాడివోయ్, మహానుభావుడు వంటి సినిమాలు అటువంటి కథలతోనే రూపొంది విజయం సాధించాయి. ఇప్పుడు సవ్యసాచి పేరుతో మరో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో హీరోకి వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ అనే ఒక వింత వ్యాధి ఉంటుంది. దానివల్ల ఎడమచేయి అతని మాట వినదు. తద్వారా కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటుందని, ప్రేక్షకులకు తెగ నచ్చేస్తుందని దర్శకనిర్మాతలు చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమాని రూపొందించారు. మరి వారి ఆశ సవ్యసాచి నెరవేర్చిందా? కార్తికేయ, ప్రేమమ్ వంటి సూపర్‌హిట్ చిత్రాలను రూపొందించిన చందు మొండేటికి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిచ్చింది? నాగచైతన్య కెరీర్‌కి ఈ సినిమా ఎంతవరకు ఉపయోగపడుతుంది? అనే విషయాలు తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్ళాల్సిందే.
్జకవలలుగా పుట్టాల్సిన వారు కొన్ని సందర్భాల్లో కలిసిపోయి పుడతారు. అలా పుట్టినవాడు మన హీరో విక్రమ్ ఆదిత్య(నాగచైతన్య). అయితే అవయవ లోపాలు లేకపోయినా మెదడు ఎడమ వైపు నుంచి ఎడమ చేయివైపు వచ్చే కొన్ని నాళాలు మరో ప్రాణికి చెందినవి. దానివల్ల ఆ మనిషి ప్రమేయం లేకుండానే ఎడమ చేయి వింతగా ప్రవర్తిస్తుంది. ఈ పాయింట్ వినడానికి కొత్తగానే ఉంది. అందులో సందేహం లేదు. అయితే ఈ పాయింట్‌తో రెండున్నర గంటలపాటు ఆడియన్స్‌ని సీట్లలో కూర్చోబెట్టడం ఎంతవరకు సాధ్యం? అందుకే వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్‌తో సంబంధం లేని మరో కథ విలన్ పాయింట్ ఆఫ్ వ్యూలో జరుగుతూ ఉంటుంది. అతని పేరు అరుణ్(మాధవన్). చాలా తెలివిగల వాడు. కొత్త వస్తువులు కనిపెట్టడం అతని హాబీ. అయితే చిన్నప్పటి నుంచి వివిధ దశల్లో అందరూ అతన్ని అవమానించినవారే. వాళ్ళందరూ ఒక బస్‌లో ప్రయాణం చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ జరుగుతుంది. అందులో ప్రయాణిస్తున్న విక్రమ్ ఒక్కడే ప్రాణాలతో బయటపడతాడు. నిజానికి ఆ బస్‌లో విక్రమ్ అక్క, బావ, మేనకోడలు కూడా ప్రయాణించాల్సి ఉంటుంది. అనుకోకుండా వాళ్ళు డ్రాప్ అవ్వడంతో విక్రమ్ ఒక్కడే వెళతాడు. అయితే అరుణ్... విక్రమ్ ఫ్యామిలీని ఎందుకు చంపాలనుకున్నాడు అనేది పాయింట్. అరుణ్‌కి సంబంధించిన కథలో వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ ప్రస్తావన లేదు. కేవలం తనను అవమానించిన వారిపై పగ సాధించడం అతని ధ్యేయం. అందులో భాగంగానే విక్రమ్ మేనకోడలు మహాని కిడ్నాప్ చేస్తాడు. విక్రమ్ ఫ్యామిలీ అరుణ్‌కి చేసిన అన్యాయం ఏమిటి? ఏం ఆశించి మహాని కిడ్నాప్ చేశాడు? తన మేనకోడల్ని విక్రమ్ ఎలా రక్షించుకున్నాడు? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.
ఒక కొత్త పాయింట్‌తో సినిమా వస్తోందంటే సినిమా అంతా ఆ పాయింట్ చుట్టూనే తిరగాలి. ఆ పాయింట్‌తోనే ఎంటర్‌టైన్‌మెంట్ అయినా, యాక్షన్ అయినా రావాలి. అలా కాకుండా ఒక పక్క హీరో ఎడమచేయి వ్యవహారం నడుస్తూ ఉండగానే మరో పక్క విలన్ ప్రతీకార కథ రన్ అవుతూ ఉంటుంది. నిజానికి విలన్ అంతటి ద్వేషాన్ని పెంచుకునే స్థాయిలో అతనికి అన్యాయం జరగలేదు. విక్రమ్ ఫ్యామిలీ విషయంలో అతనికి జరిగింది చాలా సిల్లీగా అనిపిస్తుంది. చివరికి చిన్న పాప తన దగ్గరే ఉంటుందని, తనను బాగా చూసుకుంటానని విలన్ చెప్పడం హాస్యాస్పదంగా అనిపిస్తుంది. ఇక హీరో విషయానికి వస్తే అతని ఎడమచేయి అతని మాట వినదు. అంతవరకు బాగానే ఉంది. ఆ చేయి వల్ల భరించలేని ఇబ్బందులు ఏమైనా హీరోకి కలిగాయా అంటే అదీ లేదు. కానీ, హీరో మాత్రం మాటి మాటికీ ఎడమచేయిని నిందిస్తుంటాడు. అప్పుడప్పుడు అది కదలకుండా బంధిస్తుంటాడు. దానివల్ల కలిగే ప్రయోజనం ఏమిటో ఎవరికీ తెలీదు. అసలు కథలోకి వెళ్ళే ముందు కాస్త కామెడీ, కాస్త లవ్ మిక్స్ చేసి ఫస్ట్‌హాఫ్‌ని నడిపించాడు డైరెక్టర్. హీరో, హీరోయిన్ ఆరు సంవత్సరాల క్రితమే ప్రేమించుకున్నారని కొన్ని కారణాల వల్ల విడిపోయారని చెప్తారు. ప్రేమికులు సంవత్సరాల తరబడి కలుసుకోకుండా ఉండే సందర్భాలు మన తెలుగు సినిమాల్లోనే కనిపిస్తాయి. ఆరు సంవత్సరాల తర్వాత కలుసుకున్నా ఇద్దరిలోనూ ఎలాంటి ఫీలింగ్ ఉండదు. ఒకరోజు తర్వాత కలుసుకున్నాం అన్నట్టుగా మాట్లాడుకుంటారు. నటీనటుల పెర్‌ఫార్మెన్స్ విషయానికి వస్తే అద్భుతంగా పెర్‌ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇక్కడ ఏ క్యారెక్టర్‌కీ స్కోప్ లేదు. నాగచైతన్య ఎప్పటిలాగే తన క్యారెక్టర్‌కి న్యాయం చేశాడు. పెర్‌ఫార్మెన్స్ పరంగా అతని గురించి చెప్పుకోవడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు. డాన్సులు, ఫైట్స్ ఫర్వాలేదు అనిపించాడు. విలన్‌గా నటించిన మాధవన్ తన మేనరిజమ్‌తో ఆకట్టుకున్నాడు. అయితే అతని క్యారెక్టర్‌లో అంత డెప్త్ లేకపోవడం వల్ల తేలిపోయినట్టుగా అనిపిస్తుంది. అతను చెప్తున్న పాయింట్‌లో సీరియస్‌నెస్ లేకపోవడం వల్ల కొన్ని సీన్స్ కామెడీగా అనిపిస్తాయి. ఇక హీరోయిన్ నిధి అగర్వాల్ తన గ్లామర్‌తో ఆకట్టుకుందని చెప్పొచ్చు. సత్య, వెన్నెల కిశోర్, షకలక శంకర్ వంటి కమెడియన్స్ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసి సక్సెస్ అయ్యారు.
సాంకేతిక నిపుణుల గురించి చెప్పాలంటే కీరవాణి చేసిన పాటల్లో ఏ ఒక్కటీ ఆకట్టుకునేలా లేదు. ముఖ్యంగా నిన్ను రోడ్డు మీద చూసినది లగాయతు పాటను రీమక్స్ చేయడం వల్ల సినిమాకి ఒరిగింది ఏమీ లేదు. లేటెస్ట్ మ్యూజిక్‌తో కొత్తగా చెయ్యాలనుకున్నారు కానీ, అది బెడిసి కొట్టింది. దానికి తగ్గట్టుగానే ఈ పాట పిక్చరైజేషన్ కూడా చాలా నాసిరకంగా అనిపిస్తుంది. యువరాజ్ అందించిన ఫోటోగ్రఫీ సినిమాకి కాస్త కూస్తో ప్లస్ అయింది. నాగచైతన్య, నిధిలను అందంగా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ సాదా సీదాగా ఉంది. ఫస్ట్‌హాఫ్‌లో, సెకండాఫ్‌లో సినిమాలో కత్తిరించాల్సిన సన్నివేశాలు చాలా ఉన్నాయి. కొన్ని సీన్స్ రిపీటెడ్‌గా అనిపించి ఆడియన్స్‌కి విసుగు పుట్టిస్తాయి. మేకింగ్ పరంగా మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదని సినిమా క్వాలిటీ చూస్తే అర్థమవుతుంది. ఇక డైరెక్టర్ గురించి చెప్పాలంటే చందు రాసుకున్న కథలో వానిషింగ్ ట్విన్ సిండ్రోమ్ ఒక్కటే కొత్త పాయింట్. దాంతో సినిమా మొత్తం రన్ చెయ్యడం కష్టం. అందుకే దానికి తోడుగా విలన్ కథ, హీరో, హీరోయిన్‌ల ఆరు సంవత్సరాల లవ్ వంటివి జోడించి నడిపించాడు. ఫస్ట్‌హాఫ్‌ని కామెడీ, లవ్‌తో నడిపించి ఆ తర్వాత కథలోకి ఎంటర్ అయినా ఏ ఒక్క సీన్ ఆకట్టుకునేలా బలంగా లేదు. ఫైనల్‌గా చెప్పాలంటే నాగచైతన్యను, మైత్రి మూవీ మేకర్స్‌ను ఈ సినిమా నిరాశ పరిచిందని చెప్పొచ్చు. ఒక కొత్త పాయింట్‌తో వస్తున్న సినిమా అని థియేటర్స్‌కి వెళ్ళిన ప్రేక్షకుల్ని కూడా ఈ సినిమా డిజప్పాయింట్ చేసింది.
ఫినిషింగ్ టచ్: సవ్యంగా లేని సవ్యసాచి
from Telugu Unicode News feed from Cinejosh.com https://ift.tt/2Qdo5SY
0 Comments